ఎయిమ్స్‌ పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం

వార్తలు
739 Views
ఈ నెల 11న (గురువారం) జిల్లాలో నిర్వహించనున్న ఎయిమ్స్ (AIIMS) ఎంట్రన్స్-2020 పరీక్షకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన “ఎయిమ్స్ (న్యూఢిల్లీ) ఎంట్రన్స్ – 2020 పరీక్షను తిరిగి ఈ నెల 11న నిర్వహించేందుకు ఆ సంస్థ అన్ని అనుమతులు పొందినట్లు తెలిపారు. జిల్లా పరీక్షా కేంద్రంగా ప్రొద్దుటూరు మండలంలోని బాలాజీ నగర్, తాళ్లమాపురం, లింగాపురం రోడ్డు లో ఉన్న సాయి రాజేశ్వరి ఇనిస్టిట్యూట్ ఇఫ్ టెక్నాలజీ కాలేజీలో పరీక్ష నిర్వహణకు కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసిందన్నారు. కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వం అమలు చేసిన విధివిధానాలను పాటిస్తూ.. పరీక్షకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని కలెక్టర్ సూచించారు. నిర్ధేశించిన సమయం ప్రకారం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి రవాణా సౌకర్యం కొరత లేకుండా ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను అదేశించామన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా విధించిన ఆంక్షల నేపథ్యంలో.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డులను చూపించి పరీక్షకు హాజరవ్వచ్చన్నారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పరీక్ష సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *