కరోనా నివారణకు భౌతిక దూరం పాటించాలి

వార్తలు
1,005 Views

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి ప్రభుత్వం నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్‌బాషా పేర్కొన్నారు.  శుక్రవారం కడప పట్టణంలోని భగత్ సింగ్ నగర్, రవీంద్రనగర్ లో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా ప్రభావంతో భారత దేశ వ్యాప్తంగా చేపట్టిన లాక్ డౌన్‌తో చాలామంది పేదలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రంజాన్ సందర్భంగా 45వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి భగత్ సింగ్ నగర్ లోనూ,   41 వ డివిజన్ రవీంద్ర నగర్ లో మాజీ కార్పొరేటర్ జమాల్ వల్లి 3 వేల మంది ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన పేదలందరికీ పట్టణంలోని వైకాపా కార్యకర్తలు నాయకులు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా నివారణకు జిల్లా యంత్రాంగం అనేక చర్యలు చేపడుతోందని ఇందుకు ప్రజలు  కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి కడప పట్టణాన్ని కరోన రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. జిల్లాలో 50 శాతం వరకు కంటెయిన్‌మెంట్‌ జోన్లను తొలగించడం జరిగిందన్నారు. వ్యాపారస్తులు మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి వ్యాపారం చేయాలన్నారు. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలన్నారు.  మే 23 వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజన్నారు. గత ఏడాది 2019 మే 23వ తేదీ వైకాపా ప్రభుత్వం ఏర్పడడానికి ఓట్లు కౌంటింగ్ నిర్వహించిన రోజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 శాతం మంది ఓటింగ్ లో పాల్గొని 86% సీట్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని పేర్కొన్నరు. ఈనెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కడప పట్టణంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు అన్ని డివిజన్లలో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, 31వ డివిజన్ ఇంచార్జి అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *