అక్షర జ్ఞానమే .. ఆడపిల్లకు శ్రీరామరక్ష

వార్తలు
281 Views

ఆడపిల్లకు అక్షర జ్ఞానమే శ్రీరామ రక్షగా నిలుస్తుంది. బాలికలను చదివిద్దాం.. వారి బంగారు భవితకు బాటలు వేద్దాం. అపుడే.. వారిలో మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి గుణాలు వేళ్లూనుకుంటాయి. తన కాళ్లపై స్వంతంగా నిలబడే మహిళగా ఎదుగుతుంది.. అపుడే సంపూర్ణ మహిళా సాధికారత సాధ్యమవుతుందని స్వచ్చంద సామాజిక మహిళా కార్యకర్త గోసుల అరుణ కుమారి అన్నారు.

చిన్నతనం నుంచి గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఆమె 10వ తరగతి చదువుతుండగానే వైవాహిక జీవితంలోకి అడుగేశారు. అంతటితో చదువు ఆగిపోయింది. కానీ.. అందరిలాగే.. పెళ్లి, పిల్లలు, వారి పోషణ, ఇంటి పని, వంటపని అంటూ.. సాధారణ జీవన శైలితో ఆమె సరిపెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచే తన చుట్టూ సమాజంలోని బాలికలు, మహిళలకు జరిగే అన్యాయాలను గమనించేవారు. కళ్ళముందు కనిపించే ఎన్నో కన్నీటి సంఘటనలకు సరైన పరిష్కారాలు దొరకని సందర్భాలను ఆమె గమనించారు. అప్పటినుంచే అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని ఆమె అలవరుచుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు అండగా నిలిచి, మహిళా సాధికారత దిశగా అడుగులేశారు. ఆత్మాభిమానాన్ని గౌరవించుకుంటూ.. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. పదవ తరగతి మాత్రమే చదివిన అరుణ కుమారికి.. ఏ మాత్రం ఉద్యోగాలొస్తాయ్ ? అందుకే.. తనకున్న నైపుణ్యంతో స్వయం ఉపాధినే.. తన అభివృద్ధికి పాదుగా మలుచుకున్నారు. తను వేస్తున్న అడుగులు ఎంతవరకు సాగాయో.. చూద్దాం…

భర్త అందించిన సహకారంతో.. కడపలోని వైవి స్ట్రీట్ లో 2002లో బ్యూటీపార్లర్ ను ఏర్పాటు చేశారు. ఒకవైపు ఉపాధి పొందుతూనే.. మరోవైపు బాలికలు, మహిళలపై జరుగుతున్న సాంఘిక దురాచారాలు, అఘాయిత్యాలపై.. గొంతు విప్పడం మొదలెట్టింది. ముఖ్యంగా ఒంటరి మహిళలు, ఆదరణకు దూరమైన, పురుషుల చేతిలో మోసపోయిన బాలికలు, మహిళలకు అండగా నిలవడం మొదలెట్టారు.
2004లో వెలుగు పథకంలో వీవో గా చేరి.. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షరాలు వరకు ఎదిగారు. తన అత్వవిశ్వాసం, గొంతెత్తి ధైర్యంగా మాట్లాడే గుణాలే ఆమెను జిల్లా స్థాయిలో అధ్యక్షురాలిగా నిలిపాయి. ఆ తర్వాత.. ఎంతో మంది మహిళలకు పలు రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం, గ్రామీణ మహిళలను సాధికార దిశగా అడుగులు వేయించడంలో.. జిల్లా శిక్షణా కమిటి సభ్యురాలిగా కీలకపాత్ర పోషించారు.

జిల్లా ఆటవీశాఖ సమన్వయంతో.. అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ లో కూడా ఆమె చురుకుగా పని చేశారు. అందులో భాగంగా.. సమైక్యాంధ్రగా ఉన్నపుడు తెలంగాణలో ఆమె నిర్వహించిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి. అంతే కాకుండా జిల్లా వ్యవసాయ శాఖ సమన్వయంతో.. వరి వంగడాలు, మార్కెటింగ్ అభివృద్ధిలో కూడా సహకారం అందించారు.

2008లో తమిళనాడు రాష్ట్రంలో ఫిష్ మార్కెటింగ్ (సముద్ర ఉత్పత్తులు) పై కూడా కొంతకాలం పనిచేశారు. అనంతరం 2008-12 మధ్య కాలంలో.. సమాజంలో లింగ వివక్షత, మహిళలపై జరిగే అన్యాయాలపై సామాజిక కార్యకర్తగా పోరాటం చేయడం మొదలుపెట్టారు. 2015లో జిల్లా లోక్ అదాలత్ లో పీ.ఎల్.వి. (పారా లీగల్ వాలంటీర్) మెంబర్ గా, అప్పటి లోక్ అదాలత్ జడ్జి మాలతి గారి సహకారంతో.. ఎందరో బాలికలకు, మహిళలకు చట్టపరంగా న్యాయం అందేలా సేవలందించారు.

భర్త అకాల మరణంతో.. ఒంటరి మహిళలు పడే కష్టాలేంటో..? ప్రత్యక్షంగా అనుభవించాను అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఆ క్షణం నుంచే ఒంటరి మహిళలకు ఎలాగైనా.. చేయూతను అందించాలని నిర్ణయించుకున్నారన్నారు. ఆ సమయంలో అధికారులు ఎంతో ఓదార్పును, సహాయ సహకారాలు అందించారన్నారు.

2016లో “విజేత” మహిళా మండలిని స్థాపించడం జరిగిందన్నారు. నాలాగా 10వ తరగతితోనే చదువుకోవడం మరెవ్వరూ ఆపరాదంటూ.. మారుమూల గ్రామాల్లో మహిళలకు విద్య, ఉపాధి అవకాశాల గురించి వివరించడం, అభిరుచి ఉన్న రంగాల్లో నైపుణ్య అభివృద్ధి, శిక్షణ ఇవ్వడంతో పాటు.. నెహ్రు యువ కేంద్రం వారి సాయంతో… పలువురికి ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునేందుకు ఆర్ధిక సాయాన్ని కూడా అందివ్వడం జరిగిందన్నారు. చెన్నూరు మండలంలో 150 మందికి, రాజంపేట నియోజకవర్గంలో 70 మంది మహిళలకు టైలరింగ్ శిక్షణతో పాటు 300 మందికి పైగా ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఒకవైపు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తునే.. మరోవైపు బాల్యవివాహాలను అరికట్టడంలో అరుణ కుమారి విస్తృతంగా సేవలందించారు. 2015-17 మధ్య కాలంలో గర్ల్ చైల్డ్ అడ్వాకసి కమిటీ సభ్యురాలిగా వ్యవహరించారు. అందులో భాగంగా భాగంగా.. సమాజంలో బాలికలకు రక్షణ, న్యాయం కల్పించడంతో పాటు.. బాల్య వివాహాలను అరికట్టడంలో… పలు కార్యక్రమాలను స్వచ్చందంగా నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం చెన్నూరులో నెహ్రు యువ కేంద్రం సహకారంతో.. ఒంటరి మహిళలకు “జూట్ బ్యాగుల తయారీ”లో శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో కూడా ఉపాధి లేని మహిళలకు ఆర్థికంగా అసరాను కూడా అందించారు. సేవలు తనకెంతో సంతృప్తిని ఇస్తోందని, ఈ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తానని.. అరుణ కుమారి గర్వoగా చెబుతున్నారు.

స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగ వివక్ష లేకుండా చూడడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి, సమాన సాధికారిత సాధించడం, వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *