డి.ఎల్. రవీంద్రారెడ్డి. రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి. అటు పార్టీలోనూ ఇటు పలు ముఖ్యమంత్రుల వద్ద మంత్రివర్గంలోనూ పదవులు నిర్వహించారు. తనకు తానే సాటిగా విభిన్నశైలిలో నడుస్తున్న నాయకుడిగా రవీంద్రారెడ్డిని అభివర్ణించక తప్పదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించినా తెలుగుదేశం పార్టీకి దగ్గరైనట్లే అయ్యి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం లేక పోవడంతో అటు తెలుగుదేశం ఇటు వైకాపాలు ఆకర్షిస్తున్నాయి. ఒక దశలో తెదేపాలోకి చేరుతున్నట్లుగా తన వెంట నడుస్తున్న కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా వెనుకడుగు వేశారు. భవితవ్యంపై ఊహాగానాలు చెలరేగుతున్నా రవీంద్రారెడ్డి మాత్రం కిమ్మనకుండా ఉన్నారు.
ఇదీ రాజకీయ చరిత్ర
వైద్య వృత్తి చేపట్టి ప్రజా సేవకు అంకితమైన రవీంద్రారెడ్డి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1978 నుంచి 2009 వరకు శాసనసభకు ఎనిమిది పర్యాయాలు పోటీ చేసి ఆరుసార్లు విజయం సాధించారు. రాష్ట్ర చరిత్రలోనే ఆరుసార్లు ఎన్నికైన అతి కొద్దిమందిలో రవీంద్రారెడ్డి ఒకరుగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఆతర్వాత కాంగ్రెస్‌లో పార్టీలో చేరి నేటికి కొనసాగుతున్నారు. 1955లో నియోజకవర్గం ఏర్పాటు కాగా 2014 ఎన్నికల దాకా అత్యధిక ఆధిక్యతతో విజేతగా (1989లో 33,358 ఓట్లు) నిలిచిన ఘనత రవీంద్రారెడ్డికే దక్కుతుంది. అతి తక్కువ ఆధిక్యతో (1994లో 24 ఓట్లు) విజేతగా నిలిచిన నాయకుడిగానూ రికార్డుకెక్కారు.
ప్రత్యేకత
రవీంద్రారెడ్డి రాజకీయ ఎన్నికల జీవితంలో రెండుసార్లు విజయం సాధించడం ఒకసారి ఓటమి చెందడం గమనార్హం. వరుసగా 1978, 1983లో విజయం సాధించారు. 1985లో ఓటమి చెందారు. మళ్లీ 1989, 1994లో గెలుపొందారు. 1999లో ఓడిపోయారు. 2004, 2009లో విజయం సాధించారు. 2009 ఎన్నికలతో ఎంపీగా ఎన్నికైన జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విబేధించి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో అనివార్యమైన ఉప ఎన్నికలతో (2012) వైకాపా తరపున పోటీ చేసిన జగన్మోహన్‌రెడ్డికి పోటీగా కాంగ్రెస్ పార్టీ రవీంద్రారెడ్డిని పోటీ చేయించింది. డిపాజిట్ కోల్పోయారు.
పదవీయోగం
1991 నుంచి 1994 మధ్య నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల మంత్రి వర్గంలో రవీంద్రారెడ్డి చిన్ననీటిపారుదల, విద్యుత్తు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలను నిర్వహించారు. 2004 ఎన్నికలతో రాష్రంలో కాంగ్రెస్ ప్రభంజనంతో జిల్లా వాసి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా జిల్లాకు మంత్రి పదవులు దక్కలేదు. 2009 ఎన్నికల తర్వాత కడప శాసనసభ్యుడు మహ్మద్ అహ్మదుల్లాకు పదవి వరించింది. జిల్లాలో సీనియర్ నాయకుడిగా రవీంద్రారెడ్డి ఉన్నా అవకాశం కల్పించలేదు. వై. ఎస్.మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా మంత్రి వర్గం విస్తరించలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైద్య, ఆరోగ్య, విద్య, రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108, 104, కుటుంబసంక్షేమం శాఖ, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలిలు రవీంద్రారెడ్డికి కేటాయించారు. మలివిడత విస్తరణలో వైద్యంతోపాటు విద్య, 108, 104, రాజీవ్ ఆరోగ్యశ్రీ పదవులకు కోత పెట్టారు. ఆరోగ్య, కుటుంబసంక్షేమం శాఖ, ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలితో సరిపెట్టారు. శాఖల కోతపై మంత్రి రవీంద్రారెడ్డి అప్పట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.