దక్షిణ కాశీగా పేరుగాంచి వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన పుష్పగిరి క్షేత్రం వందలాది ఆలయాలకు ఆలవాలంగా విలసిల్లింది. ఇక్కడి చెన్నకేశవ, ఉమామహేశ్వర, వైద్యనాథ, త్రికూటేశ్వర, కమల సంభవేశ్వర, రుద్రపాద, విష్ణుపాద ఆలయాలు ఆథ్యాత్మిక ప్రాథాన్యతను సంతరించుకున్నాయి. ఇక్కడి పుష్పగిరి కొండ పుష్పాచలంగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి కొండపైన వందల ఏళ్ల కిందట నిర్మించిన కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర ఆలయాన్ని చరిత్రకారుడు, రచయిత తవ్వా ఓబులరెడ్డి వెలుగులోకి తెచ్చారు. కొండపై దట్టంగా అలముకున్న చెట్ల మధ్య మరుగునపడిన ఆలయాన్ని నడిగట్టు దేవాలయంగా పూర్వకాలం పూజలను అందుకున్న ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. ఆలయాన్ని హరిహర క్షేత్రంగా నిర్మించారు. ఆలయంలో పుష్పేశ్వరస్వామి స్వయంభువు గా వెలిసినట్లు మెకంజీ లోకల్ రికార్డ్ నెం. 1211 ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ సముదాయంలో ఉమామహేశ్వరుడు , లక్ష్మీనారాయణస్వామి , సుబ్రహ్మణ్యస్వామి, విఘ్నేశ్వర విగ్రహాలను ప్రతిష్టించినట్లు మెకంజీ రికార్డ్ తెలుపుతోందని ఓబుల్ రెడ్డి వివరించారు. 12వ శతాబ్దానికి చెందిన ఒక రాజు తన ముగ్గురు భార్యలతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు ఆలయం ముందు ఉన్న ఒక శిలా శిల్ప ఫలకం స్పష్టం చేస్తున్నట్లు వివరించారు. గుప్తనిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం కాగా విగ్రహాలను పెకలించారని తెలిపారు. ఆలయ ఆవరణలో, గర్భగుడి ముఖమంటపాలలో పెద్ద పెద్ద గుంటలు తవ్వారని, శిలావిగ్రహాలను పగులగొట్టారని వివరించారు. అలనాటి ఆలయాలను జీర్ణోద్దరణ చేసి భవిష్యత్తరాలకు అందించాలని కోరుతున్నారు.
#ysrkadapa #pushpagiri #vallur #mekanji