27 నుంచి పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు

వార్తలు
515 Views

ఈ నెల 27 నుంచి 2021 జనవరి 1వరకు అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను కోవిడ్-19 ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. శనివారం స్థానిక అమీన్ పీర్ దర్గాలోని ముషాయిరా హాల్లో ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై.. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి జనాబ్ ఆరిఫ్ ఉల్లా హుసేనితో కలిసి సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి 400 ఏళ్ల చారిత్రక ప్రఖ్యాతిగాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తూ, ముందస్తు ప్రణాళికతో నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయడం జరుగుతోందన్నారు. దర్గా కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలన్నారు.
మతమరస్యానికి ప్రతీక అయిన అమీన్ పీర్ దర్గాను కుల మతాలకు అతీతంగా అందరూ భాగస్వాములై ఉత్సవాల్లో పాల్గొనడం ఇక్కడి ఆనవాయితీగా వస్తుందన్నారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన దర్గాలలో కడప అమీన్ పీర్ దర్గా ఒకటన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమలను చేపట్టాలన్నారు.
* మొదటిరోజు షా మలాంగ్ ఘాడీ నషీన్ కార్యక్రమంలో భాగంగా.. ఈ నెల 27న రఫాయీ, జలాలి, బన్వా, ఆహ్లఈ తబ్కాత్ కార్యక్రమాలు
* 28న ఉదయం దర్గా నుండి బాదుల్లా సాహెబ్ మకాన్ వరకుపకీర్ల ఊరేగింపు, సాయంత్రం పీఠాధిపతులు దివ్యాసనం, ధ్యాన తపస్సు, రాత్రి 9.30 గంటలకు గంథం మహోత్సవం
* 29న సాయంత్రం 6.30 నుండి మూశాయిరా మందిరంలో కవిసమ్మేళనం, పవిత్ర పుణ్య కార్యక్రమాలు.
* తహీల్ ఉత్సవంలో భాగంగా 30న ప్రసాద సమర్పణ, సంబంధిత హోలీ ప్రార్ధనలు.
* 31న తేదీన ఖురాన్ పఠనం, తదితర కార్యక్రమాలు.
* జనవరి 1న ముగింపు ఉత్సవాల్లో భాగంగా పీఠాధిపతుల వారి వాటర్ గండి దర్శనం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.
జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ మాట్లాడుతూ అందరి అధికారులు, స్వచ్చంద సేవా కార్యకర్తల సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. అన్నిరకాల మతాలకు సంబంధించిన పండుగలు, జనసమూహాల ఉత్సవాలను 200 మందికి మించి సమూహం లేకుండా.. నిర్వహించుకోవాల్సి ఉందని, ఆ మేరకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, సామాజిక దూరం, సానిటైజేషన్, వ్యక్తిగత పారిశుధ్యం పాటించడం వంటి ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలని, పురుషులకు స్త్రీలకు వేరువేరుగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, సురక్షితమైన తాగునీరు ఏర్పాటు చేయాలని, హై మాస్ లైట్లను చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా.. ఉరుసు మహోత్సవాలు సమయంలో ఆయా పరిసరాల్లో.. క్రమం తప్పకుండా సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ చెల్లించే ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో ఉరుసు ఉత్సవాలు జరుగుతున్న ప్రధాన రహదారుల్లో ఆర్చీలు ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 108, అంబులెన్స్ తదితర వాహనాలతో పాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు.
ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. అమీన్ పీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని, నిర్దేశించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు అమీర్, నయీమ్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి మస్తాన్ వలి, ఏఎస్పీ హుస్సేన్ సాహెబ్, డిఎస్పీ సౌకత్ అలీ, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *