జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరు సమీపంలో నిర్మించిన సర్వరాయసాగర్ రిజర్వాయరుకు కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయరుగా పేరు మార్పు చేశారు. ఈమేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ జులై 8న ఉత్తర్వులు జారీ చేశారు. సర్వరాయసాగర్‌కు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయరుగా పేరు మార్పుకు జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనను జూన్ 24న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపడంతో పేరు మార్పు చేస్తూ జలవనరుల శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీపీఐ హర్షం
సర్వరాయసాగర్ రిజర్వాయరుకు కమ్యూనిస్టు యోధుడు నరెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయరుగా పేరు మార్చడం పట్ల సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లా కమ్యూనిస్టుపార్టీ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన నర్రెడ్డి శివరామిరెడ్డి కమలాపురం పులివెందుల ఉమ్మడి నియోజకవర్గ శాసనసభ్యులుగా, సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సమితి సభ్యునిగా, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశారన్నారు. నిత్యం కరువు వాతన పడుతున్న రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు మళ్ళించాలని గాలేరునగరి లో అంతర్భాగమైన గండికోట, సర్వరాయ సాగర్ సాధనకు ప్రాణాలను పణంగా ఒడ్డి పోరాటం చేశారన్నారు. ప్రాజెక్టుల సాధనకు చేసిన పోరాటాలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం సర్వరాయసాగర్ రిజర్వాయరుకు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయరుగా మార్పు చేస్తూ ఉత్వర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
