ysrkadapa

రాచపాలెం

దురాశను వదులుకుంటేనే దు:ఖానికి తెర

మానసమ్మునందు జ్ఞానవైరాగ్యాలు
కుదురుపడగ ఆశ బెదరిపోవు
ఆశపోవనంతమొందును దుఃఖమ్ము
కాళికాంబ!హంస!కాళికాంబ……..

మనస్సులో జ్ఞానం వైరాగ్యం అనే రెండు భావాలు బాగా కుదురుకున్నాయంటే ఆశ బెదిరిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఆశ మనలోంచి వెళ్ళిపోయిందంటే దుఃఖం నశిస్తుంది. దురాశాపరులకు బ్రహ్మంగారు చేసిన బోధ ఇది. ఆయన యోగి. కనుకనే ఇలా చెప్పగలిగారు. మనిషి ఆశాజీవి. ఆశ మనిషిని నడిపిస్తుంది.  సమాజంలో దుఃఖం ఉంది. అందుకు కోర్కెలు ఉండడమే కారణమని బౌద్ధం చెప్పినట్లు చిన్నప్పుడు చదువుకున్నాం. ఏమైనా మానవజాతి ఆశతోనే ఆశ ద్వారానే బతుకుతున్నది. మరి బ్రహ్మంగారేమో ఆశను వదులుకుంటే దుఃఖం నశిస్తుంది అంటున్నారు.   మనజీవితం బాగా ఉండాలని మనం కన్నవాళ్ళకు మనజీవితం కన్నా మెరుగైన జీవితం దక్కాలని ఆశిస్తాం. దానికోసం బాగా ప్రయత్నిస్తాం. అందులో విజయం సాధించినప్పుడు పొంగిపోతాం. దీంతో ఊరుకోం. ఇంకా ఏమైనా సంపాదించగలమా. పక్కింటివాళ్ళకెంతుంది. మనకెంతుంది. వాళ్ళనదాటిపోవాల. వాళ్ళనేకాదు ఊళ్ళోవాళ్ళందరికన్నా పైనుండాల. దానికోసం ఎంతకైనా తెగించాల. అడ్డదారులు తొక్కుదాం. అన్యాయాలకు పాల్పడదాం. సుడిగుండాలు,  పద్మవ్యూహాలు ఇరికించుకుంటాయి. ఇదొక విషవలయం. అందుకోసం బ్రహ్మంగారు చెప్పేది ఆశను చంపుకో దుఃఖం నశిస్తుంది అని. ఆశను వదలుకో అంటే దురాశను వదులుకో అని. ఆశ ,అత్యాశ , దురాశ ఇవి ఒకదానిని మించి ఇంకొకటి బలమైనవి. మనిషిని లొంగదీసుకొని కృంగదీస్తాయి. ఆశవల్ల కలిగే దుష్ఫలితాలకు బలైపోవడం కన్నా  జ్ఞానాన్ని సంపాదించుకో వైరాగ్యాన్ని అలవరచుకో అన్నారు బ్రహ్మంగారు. జ్ఞానసంపదను పెంచుకో, సంపదమీద వైరాగ్యం పెంచుకో అని చెప్పారు. ఆయనకాలం నాటికి సామాన్యుల ఆశలు చాలా పరిమితంగానే ఉండి ఉంటాయి. సంపన్నుల, పాలకవర్గాల వారి ఆశలే  ఎక్కువ మోతాదులో ఉండి ఉంటాయి. ఇవాళ ఈ ఆశావర్గం తెగబలిసిపోయింది. అవతారపురుషుల బాబాల సన్యాసుల దగ్గరే ఆశా ఆకాశహర్మాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా సంపాదించు. సంపాదించడం మాత్రం మానొద్దు. సంపాదనలో విలువలు నీతి ధర్మం ఏ చాదస్తమూ వద్దు. దోచెయ్ దాచెయ్. ఈదశలో ఆశను వదులుకో దుఃఖం నశిస్తుంది అన్నసూక్తి చాదస్తంగా బతకలేనివాడి ప్రేలాపనగా అనిపించవచ్చు. ఆశలు తగ్గించుకుంటే స్వదేశంలో అప్పులు చేసేసి విదేశాలకు పారిపోవలసిన పనిలేదు కదా. ఆశలు పరిమితంగా ఉంటే బంగారు కార్లు కానుకలిచ్చేపని ఉండదుకదా, వజ్రాలకిరీటాలు దేవుళ్ళకు బహూకరించే పని ఉండదుకదా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇరుక్కోవడం ఉండదుకదా. మనం బతకడానికీ మనంకన్నవాళ్ళు బతకడానికీ సంపద కావాలని ఆశించడం తప్పుకాదు. పదితరాలకు సరిపడా ఈరోజే సంపాదించాలన్న ఉన్మాదం ఎందుకు?  అక్రమార్జనపరులు, అత్యాశా జ్వరపీడితులు, దురాశారోగగ్రస్తులు వీరబ్రహ్మం గారిని చదవాలి.

తనువు ముడతపడిన తలతెల్లవారిన
చెవులు కనులు ముక్కు చేవచెడిన
ఆత్మలోని ఆశ హద్దుపద్దులు మీరు
కాళికాంబ…..

Leave a Comment